తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోతిష్యం మీద నమ్మకంతో ప్రజలను గాలికి వదిలేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో ఆయన ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి మూడు నెలలు పట్టిందని విమర్శించారు. ఈ సమయంలో తెలంగాణ ప్రజలను గాలికొదిలేశారని అన్నారు. తెలంగాణ శాసన సభ ఎన్నికలు యధావిధిగా జరిగి ఉంటే వందల కోట్ల రూపాయల ప్రజా ధనం ఆదా అయ్యేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసన సభ ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ తుడిచిపెట్టుకు పోతుందని ఎవరో జ్యోతిష్యుడు చెబితే, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించాల్సింది ప్రజలా, జ్యోతిష్యులా అంటూ ప్రశ్నించారు. కేవలం తమ కుటుంబం కోసం ఆలోచించే వారు దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయలేరని ఆయన అన్నారు.