హోసూరు:ఇక్కడికి సమీపంలోని సానమావు వద్ద లారీతో కారును ఢీకొని ఒకరిని హత్య చేసిన సంఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి సేలం జైలుకు తరలించారు. నాయకన పల్లి గ్రామం వద్ద కాగితపు పరిశ్రమను ఆనంద బాబు, నీలిమ దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న నీలిమ విధులు ముగించుకొని కారులో హోసూరులోని ఇంటికి వస్తుండగా సానమావు అటవీ ప్రాంతంలో ఓ లారీ నీలిమ కారును ఢీకొనింది. కారుకు నిప్పంటుకొని కారు డ్రైవర్ మురళి మంటల్లో చిక్కి సజీవదహనమయ్యాడు. నీలిమ తీవ్రంగా గాయపడింది. విచారణ చేసిన పోలీసులకు ఆసక్తికర విషయాలు అవగతమయ్యాయి. వ్యాపారంలో పోటీ కారణంగానే నీలిమా దంపతులను హత్య చేసేందుకు పథకం పన్నినట్లు తెలిసింది. మధురైకు చెందిన లారీ డ్రైవర్ మహరాజ్ నీలిమా దంపతులను హత్య చేసేందుకు సుపారి తీసుకొని లారీతో కారును ఢీకొట్టాడు. 12 మంది ఈ హత్యకు పథకం పన్నినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది.