పంజాబ్ ను అపఖ్యాతి పాలుచేయడమే కేంద్రం ఉద్దేశం

పంజాబ్ ను అపఖ్యాతి పాలుచేయడమే కేంద్రం ఉద్దేశం

చండిఘడ్‌:అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి అధికారులు తిప్పి పంపిస్తున్న విషయం తెలిసిందే. చేతులు, కాళ్లకు బేడీలు వేసి వారిని సైనిక విమానంలో భారత్ కు తిరిగి పంపిస్తున్నారు. ఈ విమానాలు పంజాబ్ లోని అమృత్ సర్ ఎయిర్ పోర్టులో ల్యాండవుతున్నాయి. ఇప్పటికే ఓ విమానం ల్యాండ్ కాగా శనివారం రాత్రి మరో విమానం ల్యాండవుతుందని అధికారవర్గాల సమాచారం.అయితే, అక్రమ వలసదారులను తీసుకొస్తున్న విమానాలను అమృత్ సర్ లో దింపడం వెనక కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్ర ఉందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా పంజాబ్ ను అపఖ్యాతి పాలు చేయడానికే విమానాలను అమృత్ సర్ కు పంపిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలోనో, హర్యానాలోనో లేక మరేదైనా ఎయిర్ పోర్టులో దిగేందుకు అనుమతినివ్వడం లేదేమని కేంద్రాన్ని నిలదీస్తున్నారు.అదేవిధంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి అధికారులు పట్టుకున్నపుడు మీడియా వారిని ప్రపంచానికి చూపెడుతోందని గుర్తుచేశారు. మీడియాలో కనిపిస్తున్న వారంతా పంజాబ్ కు చెందిన వాళ్లేనని, ఇతర రాష్ట్రాల వాళ్లను మీడియా చూపించకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. గుజరాత్ లేదా మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా ఇమిగ్రేషన్ తనిఖీలలో పట్టుబడుతున్నారని అయినాసరే పంజాబీలను నేరస్థులుగా ప్రపంచానికి చూపించేలా కేంద్రం కుట్రలు చేస్తోందని భగవంత్ మాన్ మండిపడ్డారు.ఇప్పటికే వచ్చిన విమానంలో, ఈ రోజు ల్యాండ్ కానున్న విమానంలో పంజాబీలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన అక్రమ వలసదారులు ఉన్నారని మాన్ గుర్తుచేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపణలను బీజేపీ నేతలు కొట్టిపారేశారు. ఆమ్ ఆద్మీ నేతలకు తమ రాజకీయ స్వార్థం గురించిన ఆలోచనలే తప్ప దేశ రక్షణ గురించి కొంచెం కూడా చింతలేదని విమర్శించారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయడం మానుకోవాలంటూ భగవంత్ మాన్ కు బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్ వాల్ హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos