లోక్‌సభ ఎన్నికల్లో షాక్ తగిలినా వెంటనే పుంజుకున్న తెరాస తాజాగా జరిగిన మున్సిపల్ పోరులో సైతం జోరు ప్రదర్శించి తెలంగాణలో తెరాసనే కింగ్ అని మరోసారి నిరూపించుకుంది.అయితే కొన్నిచోట్ల తెరాస అభ్యర్థులు కేవలం ఒకటి రెండు ఓట్ల తేడాతో గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. రాయణపేట మునిసిపాలిటీ 7వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన మహ్మద్ సలీమ్, తన సమీప బీజేపీ అభ్యర్థి చలపతిపై కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నెగ్గారు. సలీమ్ కు 311 ఓట్ల రాగా, చలపతికి 310 ఓట్లు పడ్డాయి. మెజారిటీ ఒక్క ఓటు మాత్రమే కావడంతో, మరోసారి ఓట్లను లెక్కించిన అధికారులు సలీమ్ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. కేవలం అదృష్టంతోనే తాను ఈ ఎన్నికల్లో విజయం సాధించానని, దొంగఓట్లను తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆయన అన్నారు.ఇక, వడ్డేపల్లి మునిసిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్ అజయ్ కుమార్ మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. 7వ వార్డు నుంచి ఆయన బరిలోకి దిగి 361 ఓట్లు తెచ్చుకోగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థిని వేదవతికి 358 ఓట్లు వచ్చాయి. దీంతో వేదవతి డిమాండ్ మేరకు రీకౌంటింగ్ చేసిన అధికారులు, అజయ్ కుమార్ మూడు ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇదే విధంగా పలు మునిసిపాలిటీల్లోని వార్డుల్లో స్వల్ప మెజారిటీతోనే పలువురు గట్టునపడి, అదృష్టం కలిసొచ్చిందన్న ఆనందంలో ఉన్నారు.