బోధన్: లాక్డౌన్ వల్ల కొడుకు నెల్లూరులో చిక్కుకుపోయాడు. తానేమో తెలంగాణలో ఉంది. బిడ్డ ఎన్ని కష్టాలు పడుతున్నాడో? దు. వేళకు తింటున్నాడో ? అనే ఆరాటం, పుత్ర ప్రేమ ఏకంగా ఆమెను నెల్లూరు బాట పట్టించింది. స్కూటీపై ఒంటరిగా సుమారు 1400 కి.మీ ప్రయాణం చేసి ఎట్టకేలకు కుమారుడిని కలుసుకుంది. అదే స్కూటీపై ఇంటికి తీసుకెళ్లింది. గురువారం సోషల్ మీడియాలో ఇది సంచలనమైంది. బోధన్కు చెందిన రజియా బేగం ప్రభుత్వ ఉపాధ్యా యురాలు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. 12 ఏళ్ల కిందట భర్త మృతి చెందాడు. చిన్న కుమారుడు నిజాముద్దీన్ నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో స్నేహితుడి ఇంటికి నెల రోజుల కిందట వెళ్లాడు. లాక్డౌన్తో అక్కడే చిక్కుకుపోయారు. కుమారుడి గురించి కలతచెందిన ఆమె.. స్థానిక పోలీసులకు విషయం చెప్పి వారి నుంచి అనుమతి పత్రాన్ని (ఎన్వోసీ) తీసుకున్నారు. సోమవారం ఉదయం బోధన్ నుంచి స్కూటీపై బయలుదేరి.. సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించి మంగళవారానికి ఏఎ్సపేటకు చేరుకున్నారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన లేఖ ఉండటంతో ఆమెను మన పోలీసులు ఎక్కడా అడ్డుకోలేదు. తన కుమారుడితో సాయంత్రం తిరుగు ప్రయాణమై బుధవారం మధ్యాహ్నానికి క్షేమంగా ఆమె బోధన్ చేరుకున్నారు.