శ్రీరాముడు మావాడు ..

శ్రీరాముడు మావాడు ..

ఇప్పటికే భారత్ తో పలు వివాదాలు పెట్టుకొని తన పదవికే ఎసరు పెట్టుకున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.శ్రీరాముడు మావాడేనంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి కొత్త పల్లవి అందుకున్నారు. అసలైన అయోధ్య తమ దేశంలోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్థుడేనని చెప్పుకొచ్చారు. సాంస్కృతికంగా తాము అణచివేతకు గురి కావడం వల్లే వాస్తవాలు మరుగునపడిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని.. తమ సీతకు భారత యువరాజైన శ్రీరాముడితో వివాహం జరిగినట్టు తాము విశ్వసిస్తున్నామని అన్నారు. అప్పట్లో అయోధ్య భారత్‌లో లేదని, ఇప్పుడున్నది కల్పితమని అన్నారు. నిజానికి తమ దేశంలోని బిర్గుంజ్ దగ్గర్లో ఉన్న గ్రామమే అయోధ్య అని వివరించారు.కాగా, ఓలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో నేపాల్ విదేశాంగ శాఖ ఈ అంశంపై వివరణ జారీ చేసింది.నేపాలీ భాషలో రామాయణాన్ని రచించిన ఆదికవి భాను భక్త ఆచార్య 207వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా సోమవారం ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడారని, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రాజకీయ అంశానికీ సంబంధించినవి కాదని తెలిపింది. అలాగే ఏ ఒక్కరి మనోభావాలనూ దెబ్బతీయాలనే ఉద్దేశం ఆయనకు లేదని తెలిపింది.రాముడిపైన, ఆయన కాలానికి సంబంధించిన ప్రాంతాలపైన చాలా అపోహలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో రాముడు, రామాయణం కాలానికి సంబంధించిన విస్తృత సాంస్కృతిక, భౌగోళిక వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మరిన్ని అధ్యయనాలు జరగాలన్న అంశాన్ని ఆయన ప్రముఖంగా చెప్పారని వివరించింది.అయోధ్యను, దానికి ఉన్న సాంస్కృతిక విలువను తగ్గించే ఉద్దేశం ఓలీ వ్యాఖ్యలకు లేదని వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos