న్యూ ఢిల్లీ: బీహార్లో ఓటరు జాబితా సవరణ పార్లమెంట్ వర్షాకాల మావేశాలను కుదిపేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఇవాళ వరుసగా ఐదో రోజు కూడా పార్లమెంట్లో ప్రతిష్ఠంభణ నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టాయి. ముఖ్యంగా బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్ చేశాయి. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన నిమిషాల్లో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఎలాంటి చర్చా లేకుండానే మధ్యహ్నం 2 గంటల వరకూ దిగువ సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.