దిల్లీ: లోక్పాల్ నియామకంపై ముందడుగు పడింది. ఈ నెలాఖరులోగా లోక్పాల్ సభ్యులను నియమించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే లోక్పాల్ ఛైర్మన్, సభ్యుల నియామకానికి గానూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఛైర్మన్, సభ్యుల నియామకం కోసం రేపటి నుంచి 22 వరకు ఈ కమిటీ దరఖాస్తులు స్వీకరించనుంది. అనంతరం ఈ వీటిని పరిశీలించి ఉన్నతస్థాయి కమిటీకి నివేదించనుంది. లోక్పాల్ నియామకంపై ఎంపిక కమిటీ అనుసరిస్తున్న ధోరణిపై ఇటీవల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్పాల్ ప్యానెల్ కమిటీ సభ్యుల పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా న్యాయస్థానం ఎంపిక కమిటీకి గడువు విధించింది. సభ్యులను ఎంపిక చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్తో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సమావేశమైన ఎంపిక కమిటీ దరఖాస్తులను ఆహ్వానించేందుకు నిర్ణయం తీసుకుంది.