న్యూ ఢిల్లీ: రాజధానిలో ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ విధించటంతో మందుబాబులు వారానికి సరిపడా మందు కొనేందుకు మద్యం దుకాణాల వద్ద బారులు దీరారు. నిరుటి లాక్డౌన్ వ్యవధిలో మద్యం దొరకక పోవడంతో మందు బాబులు అల్లాడిపోయారు. ఈ సారి ఆ పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్త పడ్డారు. లాక్డౌన్ ప్రకటన వెలువడటమే మందుబాబులు వైన్ షాపుల వద్దకు పరుగులు తీశారు. తమను కరోనా నుంచి మందు కాపాడుతుందని కొందరు వ్యాఖ్యలు చేసారు. మద్యం అంగళ్ల షాపుల ముందు క్యూలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోల్ మార్కెట్ ప్రాంతంలో ఓ వైన్ షాపు ముందు వందలాది మంది క్యూ కట్టడం గమనార్హం. ఢిల్లీ అంతటా ఇదే పరిస్థితి.