సంక్షోభంలో హొసూరు రైతులు : వెంకటాచలపతి ఆవేదన

సంక్షోభంలో హొసూరు రైతులు : వెంకటాచలపతి ఆవేదన

హొసూరు : పారిశ్రామిక రంగానికి దీటుగా వ్యవసాయంలోనూ అభివృద్ది చెందిన హొసూరు రైతులు ప్రస్తుత లాక్‌డౌన్‌ వల్ల సంక్షోభంలో చిక్కున్నారని కృష్ణగిరి జిల్లా హార్టికల్చర్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటా చలపతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో వాపోయారు. హొసూరు రైతులను ఆదుకోవడానికి సత్వరమే చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ పరిణామం హొసూరు ప్రాంత రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలైన బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, బంగాళదుంపలు,క్యాప్సికంలతో పాటు రోజా, జర్బరా, కార్నేషన్ చామంతి తదితర పూలను సాగుచేస్తున్నారు. ఇక్కడ పండిన కూరగాయలు, పూలను కర్ణాటక, కేరళ, ఆంధ్ర తదితర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు.

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా హొసూరు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. రవాణా స్తంభించిపోవడంతో ఇక్కడ పండించిన పంటలు మార్కెట్లకు పోవడం లేదు. ప్రధానంగా గ్రీన్ షెడ్లలో రోజా,కార్నేషన్,క్యాప్సికం పంటలు సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోజా పూలతో పాటు టన్నుల కొద్దీ క్యాప్సికంలను చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. లక్షలు వెచ్చించి పండించిన పంటలు అమ్ముకునే దిక్కులేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చేరుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హొసూరు ప్రాంతంలో గ్రీన్ షెడ్ల ద్వారా వాణిజ్య పంటలను పండిస్తున్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని, రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని వెంకటా చలపతి కోరారు. రైతుకు కనీస గిట్టుబాటు ధరతో పాటు నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి, తమిళనాడు ముఖ్యమంత్రికి ఆయన రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos