న్యూ ఢిల్లీ: భూ భ్రమణ వేగం పెరిగింది. ఫ్రాన్స్ లోని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (ఐఈఆర్ఎస్), బ్రిటన్ లోని నేషనల్ ఫిజిక్స్ ప్రయోగ శాల శాస్త్రవేత్తల ప్రకారం భూమి వేగం పెరగడం వల్ల సగటున రోజుకు 0.05 మిల్లీ సెకన్ల కాలం తగ్గింది. ఏడాదికి లెక్కిస్తే 19 మిల్లీ సెకన్లు. ఇప్పుడు తొలిసారిగా ఒక్క లీప్ సెకన్ ను కాలం నుంచి తీసేయాలని భావిస్తున్నారు. రోజుకు 86,400 సెకన్లుంటాయి. అయితే, నిరుడు జులైలో అత్యధికంగా 1.4602 మిల్లీ సెకన్ల కాలం తగ్గి దాఖలా నమోదైంది. అది 2005 జులై 5న నమోదైన 1.0516 మిల్లీ సెకన్ల లోటు వ్యవధి కంటే ఎక్కువ. లీప్ సెకన్ ను ఇప్పటిదాకా 28 సార్లు కాలానికి కలిపారు. చివరిసారిగా 2016 డిసెంబర్ 31న కలిపారు. ఆ రోజు 23 గంటల 59 నిమిషాల 59 సెకన్ల టైం మాత్రమే నమోదు కావడంతో ఒక సెకను కలిపారు. ఇప్పుడు ఓ సెకన్ ను తీసేయాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవడం చాలా తొందరపాటే అవుతుందని, మున్ముందు భూమి వేగం పెరిగితే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని నేషనల్ ఫిజిక్స్ లేబొరేటరీ భౌతిక శాస్త్రవేత్త పీటర్ విబ్బర్లీ చెప్పారు. ఏడాదికి 365 రోజులు. వాస్తవానికి పావు రోజు ఎక్కువే ఉంటుంది. దాన్ని ఒక ఏడాదిలో లెక్కించటం కష్టం. అందువల్ల నాలుగేండ్లకు ఓ రోజుగా లెక్కించి లీప్ ఏడాదిగా పిలుస్తారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. లీప్ సెకనూ అంతే. వేగంలో మార్పుల వల్ల సౌర కాల ,ఆటమిక్ కాల వ్యవస్థల (కో ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం) మధ్య తేడాలొస్తుంటాయి. ఆ తేడాలను సమతుల్యం చేసేందుకు వేగం తగ్గితే ఓ సెకన్ ను కలుపుతారు. వేగం పెరిగితే ఒక సెకను తీసేస్తుంటారు.