పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నివాసం ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్ పబ్లిక్ కమిషన్ నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్-3 పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఎం నితీశ్‌కుమార్ నివాసం ముందు ఆందోళనకు దిగారు. వాస్తవానికి బీపీఎస్సీ టీచర్ రిక్రూట్మెంల్ ఎగ్జామ్-3 ఫలితాలను ఇప్పటికే ప్రకటించారు. అయితే కొన్ని కారణాలవల్ల కొందరి ఫలితాలను హోల్డ్‌లో పెట్టారు. పెండింగ్‌లో పెట్టిన సప్లిమెంటరీ ఫలితాలను తక్షణమే విడుదల చేయాలని ఇప్పుడు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. సీఎం నివాసం ముందు ఆందోళనకు దిగిన అభ్యర్థులు నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసుల అడ్డుకున్నారు.దాంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అభ్యర్థులు బారీకేడ్లను తోసుకుని సీఎం నివాసంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో పరిస్థితి అదుపుతప్పుతుందని గ్రహించిన పోలీసులు లాఠీచార్జి చేశారు. దాంతో అక్కడ పరిస్థిత ఉద్రిక్తంగా మారింది. లాఠీచార్జికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.