శ్రీలంకలో అత్యవసర పరిస్థితి

శ్రీలంకలో అత్యవసర పరిస్థితి

కొలంబో : ఈస్టర్‌ సందర్భంగా వరుస బాంబు పేలుళ్లతో అట్టుడికిన
శ్రీలంకలో సోమవారం అర్ధ రాత్రి నుంచి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించనున్నారు. దేశాధ్యక్షుడు
మైత్రీపాల సిరిసేన కార్యాలయం ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ చర్య కేవలం ఉగ్రవాద నియంత్రణకేనని,
పౌరుల భావ స్వేచ్ఛకు ఎమర్జెన్సీ అడ్డు కాబోదని ఆ ప్రకటన పేర్కొంది. ఆదివారం ఈస్టర్‌
సందర్భంగా జరిగిన వరుస పేలుళ్లలో 290 మంది పౌరులు మరణించగా, అయిదు వందల మందికి పైగా
గాయపడ్డారు. దాడుల వెనుక స్థానిక ఉగ్రవాద సంస్థ నేషనల్‌ తౌవీత్‌ జమాత్‌ హస్తం ఉండవచ్చని
ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రతినిధి రజితా సేనరత్నే తెలిపారు. దాడులు జరిగే అవకాశాలున్నాయని
ఈ నెల 4న అంతర్జాతీయ నిఘా సంస్థలు హెచ్చరించాయని, 9న దీనిపై ఇన్‌స్పెక్టర్‌ జనరల్ ఆఫ్‌
పోలీసుకు సమాచారం అందించామని వెల్లడించారు. ఈ దాడుల వెనుక అంతర్జాతీయ సంస్థల హస్తం
ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

మరో పేలుడు…కొలంబోలోని చర్చి వద్ద సోమవారం మరో పేలుడు సంభవించింది.
చర్చి వద్ద ఆగి ఉన్న వ్యానులో బాంబు ఉందని తెలుసుకుని, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ దానిని
నిర్వీర్యం చేసే లోపే పేలిపోయింది. మరో వైపు ఈ దారుణ మారణకాండతో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
దేశ వ్యాప్తంగా సమగ్ర తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం వద్ద ఉగ్రమూకలు
అమర్చిన బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కొలంబోలోని ప్రధాన బస్టాండులో 87 డిటోనేటర్లను
గుర్తించారు. తనిఖీ సమయంలో ఇవి బయటపడ్డాయని, సకాలంలో గుర్తించకపోయి ఉంటే మరో దారుణం
జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు. హోటళ్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, రద్దీ ప్రాంతాల్లో
భద్రతను పెంచారు.

కొలంబోలో పేలుడు జరిగిన ప్రాంతాల్లో పోలీసుల పరిశీలన

తాజా సమాచారం

Latest Posts

Featured Videos