న్యూ డిల్లీ: డిఎల్ఎఫ్ లంచం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ధిషిగా సీబీఐ తేల్చినట్లు తెలుస్తోంది. దాణా కుంభకోణం కేసులో మూడేళ్ల పాటు జైలు పాలైన ఆయన గత ఏప్రిల్ లో విడుదలయ్యారు. డీఎల్ఎఫ్ కేసులో కూడా ఆయనకు ఉపశమనం లభించింది. ముంబైలోని బాంద్రా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ప్రాజెక్టులకు సంబంధించి డీఎల్ఎఫ్ గ్రూప్ నుంచి లాలూ లంచం తీసుకున్నాడనేది ఆరోపణ. సీబీఐ ఆర్థిక నేరాల విభాగం 2018 జనవరిలో విచారణను ప్రారంభించింది. రెండేళ్ల విచారణలో లాలూపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీబీఐ అధికారులు తేల్చారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రైల్వే పథకాల అమల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముందటి తేదీలు వేసిన చెక్కులు, బోగస్ లావాదేవీలు, లాలూ కుటుంబ సభ్యులకు అతి తక్కువ ధరలకే ఆస్తుల బదలాయింపు వంటి వాటిలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఆదాయపన్ను శాఖ కూడా దీని పై ప్రత్యేక దర్యాప్తును చేపడుతోంది.