న్యూ ఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఆయన్ను ప్రత్యేక ఎయిర్ అంబులెన్సులో దిల్లీకి తీసుకు వచ్చారు. అయితే, ఆయన పరిస్థితి మెరుగుపడలేదని తెలుస్తోంది. లాలూ శరీరంలో కదలికలు లేవని ఆయన తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. “దిల్లీ ఎయిమ్స్ వైద్యులు లాలూ యాదవ్‌కు చాలా రోజుల నుంచి చికిత్స చేస్తున్నారు. నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉన్న వైద్యులు ఇక్కడ ఉన్నారు. ఇంట్లో కింద పడ్డ సమయంలో మూడు చోట్ల ఆయనకు గాయా లయ్యాయి. ప్రస్తుతం ఆయన శరీరంలో ఎలాంటి కదలికలు లేవు. ఇప్పటివరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారు. పరీక్షించిన తర్వాత ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయానికి వస్తాం.”అని వివరించారు. పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని ఇదివరకే తేజస్వీ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి చికిత్స కోసం గత నెలలోనే జార్ఖండ్ హైకోర్టు నుంచి లాలూ అనుమతి తీసుకున్నారు. లాలూ కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు బిహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు దిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు.