న్యూఢిల్లీ: బిలియనీర్లు లలిత్ మోదీ , విజయ్ మాల్యాలు.. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ ఇద్దరు కలిసి పార్టీలో పాట పాడారు. లండన్‌లో చాలా విలాసవంతంగా ఆ వేడుకను నిర్వహించారు. లలిత్ మోదీ తమ పార్టీకి చెందిన వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. వార్షిక సమ్మర్ పార్టీని ఆర్గనైజ్ చేసినట్ల మోదీ చెప్పారు. సుమారు 310 మంది ఫ్రెండ్స్, అతిథులు ఆ వేడుకకు హాజరయ్యారు. బ్రిటన్ రాజధానిలో ఉన్న మోదీ నివాసంలోనే ఆ పార్టీ జరిగింది. మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమీషనర్ లలిత్ మోదీ, లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా ఆ పార్టీలో స్టెప్పులేశారు. దేశవిదేశాల నుంచి అతిథులు .. ఆ పార్టీ కోసం లలిత్ మోదీ నివాసానికి చేరుకున్నారు.ఆర్సీబీ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ కూడా ఆ పార్టీకి వెళ్లాడు. లలిత్ మోదీ, మాల్యాతో దిగిన ఫోటోను గేల్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేశాడు. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మెన్‌గా ఉన్న లలిత్ మోదీ.. ఆ తర్వాత ఈడీ కేసులు నమోదు కావడం దేశం విడిచి వెళ్లారు. ఫెమా, మనీల్యాండరింగ్ కేసుల్లో అతను విచారణ ఎదుర్కొంటున్నారు. అతన్ని అప్పగించాలని భారత్ అనేక సందర్భాల్లో బ్రిటన్‌ను కోరింది. కానీ అతను బ్రిటీష్ రెసిడెంట్‌గానే కొనసాగుతున్నారు. రాజకీయ దురుద్దేశంతో తనపై కేసులు నమోదు చేశారని లలిత్ మోదీ ఆరోపిస్తున్నారు. యునైటెడ్ బివరీస్ వ్యవస్థాపక చైర్మెన్ విజయ్ మాల్యా 2016లో దేశాన్ని విడిచి వెళ్లారు. భారత ప్రభుత్వం అతన్ని ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దివాళా కేసులో భారత ప్రభుత్వం సుమారు 14వేల కోట్ల ఆస్తులను సీజ్ చేసిందని గత ఏడాది ఓ పోస్టులో విజయ్ మాల్యా పేర్కొన్నారు. తాను ఇంకా ఆర్థిక నేరస్థుడిగా ఉన్నానని, చేసిన అప్పు కన్నా రెండింతలు ఎక్కువ తన వద్ద తీసుకున్నారని మాల్యా తన పోస్టులో రాశారు.