న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు తక్కువ వేతనాలు లభిస్తుండడంపై పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కార్మికుల వేతనాలు సవరించాలని, వాటిని ద్రవ్యోల్బణ రేటుకు అనుగుణంగా ధరల సూచీతో అనుసంధానం చేయాలని సూచించింది. గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ ఉపాధి హామీ పథకం వేతన రేటుపై ఇటీవల లోక్‌సభకు తన నివేదికను అందజేసింది. పథకంలో కనీస పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కూడా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలకా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది.2006లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి 2011-12 వరకూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కనీస వేతనాల ఆధారంగానే వేతన రేటును నిర్ణయించారు. 2011-12 నుంచి వ్యవసాయ కార్మికుల వినియోగ ధరల సూచీ (సిపిఐ-ఎఎల్)ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వమే వేతన రేట్లను నిర్ణయించడం మొదలు పెట్టింది. ఈ సూచీ ఆహార వస్తువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అయితే గ్రామీణ ప్రాంత వినియోగ ధరల సూచీ (సిపిఐ – రూరల్) ఆధారంగా కార్మికుల వేతనాలను నిర్ణయిస్తే సబబుగా ఉంటుందని 2015లో ఆర్థికవేత్త మహేంద్ర దేవ్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ, 2018లో గ్రామీణాభివృద్ధి శాఖ సీనియర్ అధికారి నగేష్ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన మరో కమిటీ అభిప్రాయపడ్డాయి. ద్రవ్యోల్బణ ప్రభావం నుండి ఈ సూచీ వేతనాలకు రక్షణగా నిలుస్తుందని తెలిపాయి. ఆహార, ఇతర సేవలపై పెట్టే వ్యయాలకు ఈ సూచీ సమాన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పాయి.ఏ పనికైనా రోజుకు కనీసం రూ.375 వేతనం ఇవ్వాలని 2018లో కార్మిక ఆర్థికవేత్త అనూప్ శతపతి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ సిఫారసు చేసింది. కాగా ఉపాధి పథకం కార్మికులకు ప్రస్తుతం నామమాత్రపు వేతనాలు ఇస్తున్నారని, అవి కూడా ఆలస్యంగా అందుతున్నాయని పార్లమెంటరీ కమిటీ ఎత్తిచూపింది. కార్మికుల వలసలకు ఇది కూడా ఓ కారణమని తెలిపింది.ప్రతి కుటుంబానికీ ఏడాదికి కనీసం 150 పనిదినాలు కల్పించాలన్న పౌర సమాజ బృందాల డిమాండుకు కమిటీ గతంలోనే మద్దతు తెలిపింది. పనిదినాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చామని గ్రామీణాభివృద్ధి శాఖ పార్లమెంటరీ కమిటీకి తెలియజేసింది. అయితే అదనపు పనిదినాలకు చెల్లించే వేతనాల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ఈ సమాధానంపై పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్ట సవరణ ద్వారా పనిదినాలను పెంచి, ఆ నిబంధనను దేశంలోని అన్ని రాష్ట్రాలకూ వర్తింపజేయాల్సింది గ్రామీణాభివృద్ధి శాఖేనని స్పష్టం చేసింది. ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని తప్పనిసరి చేయకూడదని, దానికి బదులు ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని రూపొందించాలని కూడా కమిటీ సూచించింది.