హొసూరు : ఇక్కడికి సమీపంలోని ఎలతగిరి గ్రామంలో గల పురాతన వినాయక దేవాలయ కుంభాభిషేక ఉత్సవాన్ని మూడు రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా మొదటి రోజు ఆలయంలో గణపతి హోమం, వాస్తు హోమం, కలశ స్థాపన తదితర కార్యక్రమాలు చేపట్టారు. రెండవ రోజు విఘ్నేశ్వరునికి విశేష పూజలు, దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మూడవ రోజు పుణ్యనది జలాలతో ఊరేగింపుగా వచ్చిన మహిళలు స్వామివారికి అభిషేకం చేశారు. వినాయకుని విశేష పూజలు నిర్వహించి, కుంభాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తదుపరి ఆలయంలో స్వామివారికి మహా మంగళ హారతినిచ్చి,
తీర్థ ప్రసాద వినియోగం చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.