ఢిల్లీ : పాకిస్థాన్‌లోని భారత దౌత్యాధికారులు అక్కడ చెరలో ఉన్న నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను శుక్రవారం కలవడానికి ఆ దేశం అనుమతించింది. అయితే దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది. అంతర్జాతీయ న్యాయ స్థానం ఆదేశాల మేరకు ఈ భేటీకి పాక్ అనుమతించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడనే సాకుతో పాక్ సైనికులు 2016లో జాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అక్కడి సైనిక న్యాయ స్థానం విచారణ జరిపి, 2017 ఏప్రిల్‌లో ఆయనకు మరణ శిక్ష విధించింది. ఆయన గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పాక్ నిందలు మోపింది. భారత్ ఈ వాదనలను ఖండించింది. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటూ ఉంటే అపహరించారని ఆరోపించింది. అంతర్జాతీయ న్యాయ స్థానం పాక్ తీరును ఎండగట్టింది.