ఏదైనా రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాత్రమే విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం అత్యంత సాధారణ విషయం.కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలైన తెదేపా, వైసీపీ, జనసేనలతో పాటు పక్క రాష్ట్రమైన తెరాసపై కూడా విమర్శలు,ఆరోపణలు వస్తుండడం తెరాస కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై,పార్టీలపై స్పందిస్తోంది.తాజాగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో 28 రాష్ట్రాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ట్విట్టర్‌లో సమాధానమిచ్చారు. మీ వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య ఇబ్బందులు,సమస్యలు సృష్టించ వద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ రాజకీయ లబ్ది కోసం తెలుగు రాష్ట్రాల మధ్య,రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం సముచితం కాదన్నారు. గాజువాక,బీమవరం నియోజకవర్గాల నుంచి నామినేషన్ దాఖలు చేసిన పవన్ అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణకు వెళ్లే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అంతకుముందు జనసేన ఆవిర్భావ సభలో కూడా ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ కేసీఆర్‌కు నమస్కరించి కోరుతున్నట్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే..