బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ సమర్పించారు. ఉదయం బళ్లారి జిల్లా హొసపేటె ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామా చేయగా, మధ్యాహ్నానికి బెల్గాం జిల్లా గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జారకిహొళి కూడా ఆయన బాట పట్టారు. ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నెల 5న ఆయన తిరిగి రానున్నారు. న్యూజెర్సీలో ఓ దేవాలయ ప్రతిష్ఠలో ఉన్నానని, కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని కుమారస్వామి తెలిపారు. ఈ హఠాత్పరిణామంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పైనే ఉందని జేడీఎస్ అధినేత హెచ్‌డీ. దేవెగౌడ వెల్లడించారు. మరో వైపు కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పతనమైతే భాజపా నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రకటించారు.