ముంబై : భీమా-కోరేగావ్ కేసును ఎన్ఐఏకి అప్పగించలేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఇక్కడ స్పష్టీకరించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయిన తర్వాత ఇద్దరూ కలసి విలేఖరులతో మాట్లాడారు. ‘భీమా-కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులు రెండు వేరు వేరు. భీమా కోరేగావ్ కేసు దళిత సోదరులకు సంబం ధించింది. ఎట్టి పరి స్థితుల్లో వారికి అన్యాయం జరగ కుండా చూసే బాధ్యత నాపై ఉంది. ఈ కేసును ఇప్పటి వరకు కేంద్రానికి అప్పగించ లేదు. కేవలం ఎల్గార్ పరిషత్ కేసు మాత్రమే ఎన్ఐఏకి బదిలీ అయింది. ఇక ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వేర్వేరు అంశాలు. సీఏఏ అమలైనా ఎవరూ చింతించాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్సీని మాత్రం రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. ఒకవేళ ఎన్ఆర్సీ అమలు హిందూ, ముస్లింలతో పాటు ఆదివాసీలనూ ప్రభావితం చేస్తుంది. దీని పై కేంద్రం కూడా చర్చించలేదు. ఎన్పీర్ కేవలం పది సంవత్సరాలకు ఒకసారి జరిగే సెన్సెస్ ప్రక్రియ మాత్రమే. దీని వల్ల ఎవరిపై ఎలాంటి ప్రభావం పడద’ని విపులీకరించారు. సిఏఏపై ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయంతో శరద్ పవార్ విభేదించారు. ‘సీఏఏ అమలైనా చింతించాల్సిన అవసరం లేదనడం ఉద్ధవ్ వ్యక్తిగత అభిప్రాయం. ఎన్సీపీ మాత్రం సీఏఏకి వ్యతిరేకంగా ఓటు వేసింద’ని గుర్తు చేశారు.