హైదరాబాద్ : హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ సమక్షంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమన్వయకర్తలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్యులతో సమావేశం జరిగింది. పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లతో మరో భేటీ కూడా జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్ అభ్యర్థిపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. శుక్ర, శనివారాల్లో అభ్యర్థి పేరును వెల్లడించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హుజురాబాద్ అభ్యర్థి విషయంలో ప్రధాన పార్టీలన్నీ బిసి వర్గాల వారికే ప్రాధాన్యతనిచ్చాయి. బిజెపి నుంచి ఈటల రాజేందర్.. టిఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బిసి వర్గానికి చెందిన వారే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా బిసి వర్గానికి చెందిన కొండా సురేఖను అభ్యర్థిగా బరిలో నిలపాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సురేఖ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. ఆమె భర్త మురళి మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఈ రెండు సామాజిక వర్గాలకు నియోజయవర్గంలో 55 వేల పైచిలుకు ఓట్లు ఉండడం కలిసివచ్చే అంశంగా కాంగ్రెస్ నేతలు భావించినట్లు సమాచారం. ఈటల రాజేందర్ ముదిరాజ్ వర్గానికి చెందినవారు కాగా.. గెల్లు శ్రీనివాస్ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో ముదిరాజ్ల ఓట్లు 23,220 ఉండగా.. యాదవ సామాజిక వర్గానికి 22,150 ఓట్లు ఉన్నాయి. సురేఖను పోటీలో నిలిపితే కాపు, పద్మశాలి సామాజికవర్గాల నుంచి ఓట్లు పొందే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. హుజురాబాద్‌లో పోటీ చేసేందుకు సిద్ధం అంటూనే.. 2023 ఎన్నికల్లో కూడా అక్కడే టికెట్ ఇవ్వాలని సురేఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.