తెలంగాణ కేసీఆర్ వల్లే రాలేదు

తెలంగాణ కేసీఆర్ వల్లే రాలేదు

హైదరాబాదు:తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత కేవలం కేసీఆర్‌కు మాత్రమే దక్కదని, రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ఆయనది ఒక పాత్ర మాత్రమేనని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం వచ్చిందనే వాదనను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర భయాందోళనల మధ్య బతికారని, కనీసం నోరు విప్పి తమ సమస్యలు చెప్పుకోలేని దుస్థితి ఉండేదని కోదండరాం విమర్శించారు. ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ఇందుకోసం ఉద్యమ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 15న జన సమితి రాష్ట్ర కార్యాలయంలో ఉద్యమ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, తెలంగాణ ఒక వ్యక్తి వల్లే వచ్చిందన్న ప్రచారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎందరో చేసిన త్యాగాలు, సమష్టి పోరాటాల ఫలితమే తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.సౌత్‌ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ గాలి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు చేసిన భూకబ్జాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరో 500 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉందని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos