ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలు,మంత్రుల ప్రవర్తనపై రోజురోజుకు వ్యతిరేకేత,విమర్శలు ఎక్కువవుతున్నాయి. నేతలు,మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు,చర్యలు ప్రజల్లో ఆగ్రహావేశాలు,విమర్శలకు దారి తీస్తున్నాయి.స్వతహాగా దూకుడుగా ఉండే మంత్రి కొడాలి నాని కొద్ది రోజులుగా మరింత నోటిదరుసు ప్రదర్శిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు.తన నోటి దురుసు కారణంగా వివాదాల్లో చిక్కుకుంటూ లేని తలనొప్పులు తెచ్చుకున్నారు.కొద్ది రోజుల క్రితం తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు తనయుడు నారా లోకేశ్‌పై కూడా అసభ్య పదజాలాలతో దూషణలకు పాల్పడ్డ నాని తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలయ ప్రవేశానికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు తిరుమల ఆలయాన్ని ఎవడి అమ్మ మొగుడు నిర్మించాడు అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై అటు టిడిపి నేతలు, ఇటు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అన్య మతస్థులు ఎవరు వెళ్లాలన్నా తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని భాను ప్రకాష్ పేర్కొన్నారు.బీజేపీ తో పాటుగా, హిందూ సంఘాలు బ్రాహ్మణ సంఘాలు సైతం నాని ఆ విధంగా వ్యాఖ్యానించడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తిరుమల నియమావళిని ఎవరు అతిక్రమించడానికి వీలు లేదని, భక్తుల విశ్వాసాలపై, సాంప్రదాయాలపై నిజంగా మాట్లాడే వారిని ఉపేక్షించ కూడదంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి .తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న దేవస్థానం, అది ప్రభుత్వ అధీనంలోని నడిచే దేవస్థానం కాదని గుర్తు చేస్తున్నారు. ఇతర మతస్థులు అయిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ వరకు ప్రతి ఒక్కరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడానికి వెళతారని కొడాలి నానికి గుర్తుచేస్తున్నారు హిందూ సంఘాల నాయకులు.ఇక బిజెపి నాయకులు అయితే మంత్రి కొడాలి నానిని సీఎం జగన్మోహన్ రెడ్డి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.హిందూ సంఘాలు, బిజెపి నాయకులు, బ్రాహ్మణ సంఘాలు ఇంతగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా నాని దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.ఆంగ్ల మాధ్యమం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ఇలా వైసీపీ నేతలు ఇతర నేతలపై ముఖ్యంగా కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానం గురించి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుంటే మౌనం వహిస్తుండడం దేనికి సంకేతమో?ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ మతమార్పిడిలకు ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లవుతుంది.వీటిపై ప్రజల నుంచి నిరసనలు,వ్యతిరేకత వ్యక్తం కాకముందే వైఎస్ జగన్ మేల్కొని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి.లేదంటే వైసీపీ భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..