రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజాగ్రహాన్ని
చవిచూసి నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కోలుకోలేకపోయింది.పార్టీపై
వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ కార్యక్రమాల్లో అంతగా చురుగ్గా
పాల్గొనేవారు కాదు.అసలు కాంగ్రెస్ పార్టీ అంటూ ఒకటుందా అనే స్థాయికి కాంగ్రెస్ పరిస్థితి
దిగజారింది.ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముంగిట నిలిచాయి.ఎన్నికలు
ఎదుర్కోవడానికి ముందు అసలు ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరపున నిల్చోవడానికి అభ్యర్థులు
దొరుకుతారా అనే సమస్య కాంగ్రెస్ నేతలకు అతిపెద్ద భయం,సవాల్‌గా మారింది.అయితే ఆ భయాలు,అనుమానాలు
పటాపంచలు చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తే నేనంటే..నేను పోటీ చేస్తానని
వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. అసలు పార్టీ పూర్తిగా తుడిచిపోట్టుకుపోతుందా..? అన్న తరుణంలో ఈ రేంజ్లో దరఖాస్తులు రావడంతో ఏపీసీసీ పెద్దల్లో
కొత్త సంబరం,ఉత్సాహం నెలకొంది.కథ ఇంత వరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ పార్టీలో
ఇద్దరు సీనియర్ నేతలు మాత్రం పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదంటూ వస్తున్న వార్తలు
కాంగ్రెస్ నేతలను కొద్దిగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి.అందులో ఒకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాగా.. మరొకరు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి. ఇద్దరు
నేతలు ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గానీ పోటీ చేసేందుకు ఎలాంటి దరఖాస్తు పెట్టలేదట. దీంతో వారి నిర్ణయం వెనుక మర్మమేమిటని కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 2014
ఎన్నిల్లో ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో పార్టీ పెట్టుకొన్న నల్లారి కిరణ్ రెడ్డి ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ తరువాత పొలిటికల్ గా యాక్టివ్ గా లేని కిరణ్ కుమార్ రెడ్డి గత ఏడాది రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తనతో పాటు పార్టీ వీడిన వారిని మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి తీసుకువస్తారని అంతా ఆశించారు. కానీ నల్లారి ఉత్సాహం పార్టీలో ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.దీంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడని తెలిసిపోతుంది. కానీ ఎన్నికల సమయంలో పార్టీల్లో ఉత్సాహం నింపుతారని పార్టీ పెద్దలు అంటున్నారు. అయితే పార్టీ కోమాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కీలక నేతలు దూరంగా ఉండడంపై ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కాంగ్రెస్ నాయకులు మథనపడుతున్నారు. అలాగే మరో నేత మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు ఎలాంటి దరఖాస్తు పెట్టుకోలేదట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరంజీవిని ఆ పార్టీ స్టార్ క్యాంపెయిన్ లిస్టులో చేర్చింది. కానీ అయినా పార్టీ తరుపున ప్రచారం చేయలేదు. పార్టీ అధ్యక్షుడు తెలంగాణలో జోరుగా పర్యటించినా చిరంజీవి ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన జనసేనకు మద్దతు ఇస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆయన కాంగ్రెస్ తరుపున పోటీ చేయనని చెప్పకనే చెప్పినట్లేనని అనుకుంటున్నారు.