అమరావతి : వర్షా భావం, అదను తప్పిన వానలు, కరోనా, గిట్టుబాటు ధరల్లేమి ఖరీఫ్ను కుంగదీశాయి. సాధారణ విస్తీర్ణంలో నాలుగు లక్షల హెక్టార్లు (పది లక్షల ఎకరాలు) సేద్యానికి నోచుకోలేదు. 11 శాతం సాగు తగ్గింది. నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఇంతటి స్థాయిలో సాగుకు యోగ్యమైన పొలాలు తొలిసారిగా బీడు పడ్డాయి. దాదాపు అన్ని పంటల సాగు తగ్గింది. ఆహారధాన్యాలు 1.68 లక్షల హెక్టార్లు (4 లక్షల ఎకరాలు) తగ్గాయి. అన్ని పంటల సాగు 37.33 లక్షల హెక్టార్లు , 33.32 లక్షల హెక్టార్లలో సేద్యం జరిగింది. 38.14 లక్షల హెక్టార్లలో సాగును ఆశించింది. భూగర్భ జలాలతోపాటు ప్రధాన రిజర్వాయర్లలో, చెరువుల్లో, కుంటల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సైతం వరి తగ్గింది. అక్టోబర్ రెండవ వారం వరకు నీటి వసతులున్న చోట్ల వరి వేస్తారని చెబుతున్నప్పటికీ మహా అయితే ఇంకో 20 వేల హెక్టార్లలోపేనని అంచనా వేస్తున్నారు. చిరుధాన్యాలలో మొక్కజన్న మినహా అన్ని పంటలూ తగ్గాయి. మొత్తంగా చిరుధాన్యాలు 24 వేల హెక్టార్లు (13 శాతం) తగ్గాయి. ఈ తడవ పప్పుధాన్యాలు 84 వేల హెక్టార్లు (25 శాతం) తగ్గాయి. కందులు, పెసలు, మినుములు, అలసందలు అన్నీ తగ్గాయి. నూనెగింజలు 84 వేల హెక్టార్లు (11 శాతం) తగ్గాయి. వేరుశనగ 75 వేల హెక్టార్లు (10 శాతం) తగ్గింది. ఆముదాలు, నువ్వులు సైతం తగ్గుదలే. వాణిజ్య పంటల సాగూ తగ్గింది. పత్తి 96 వేల హెక్టార్లు (16 శాతం) తగ్గింది. జనుము , పసుపు, ఉల్లి, చెరకు తగ్గాయి. మిరప మాత్రమే నూరు శాతం సాగైంది.