
దిల్లీ: లోక్‌పాల్ ఎంపిక సమితి సమావేశానికి తాను హాజరు కావడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సమావేశానికి ‘ప్రత్యేక ఆహ్వానితుని’గా హాజరు కావాలని పిలిచినందునే దానికి హాజరు కావడం లేదని లేఖలో వివరించారు. ఇదే కారణంతో గతంలోనూ ఖర్గే పలు సార్లు సమావేశాన్ని బహిష్కరించారు. తన గైర్హాజరును సాకుగా చూపి లోక్‌పాల్ నియామకాన్ని కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక ఆహ్వానితునిగా చర్చల్లో పాల్గొంటే తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఉండదని ఖర్తే తెలిపారు. ప్రతి పక్షంలోని అతిపెద్ద పార్టీకి చెందిన వ్యక్తిని సభ్యునిగా నియమించేలా లోక్‌పాల్ చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ మేరకు సవరణలకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. లోక్‌పాల్ ఎంపికలో ప్రతి పక్షానికి స్థానం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఖర్గే ఆరోపించారు.లోక్‌పాల్ నియామకంపై ఎంపిక సమితి సమావేశ మయ్యే తేదీల్ని తెలపాలని మార్చి 7న కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అందుకు పది రోజుల గడువు విధించింది. దరిమిలా ప్రధాని అధ్యక్షతన శుక్రవారం ఎంపిక సమితి సమావేశం కావాల్సి ఉంది. లోక్‌పాల్ చట్టం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియ మించిన వ్యక్తి, ప్రతిపక్షనాయకుడు, మరికొంత మంది కీలక వ్యక్తులు ఎంపిక సమితి సభ్యులుగా ఉండాలి. ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేని కారణంగా ఖర్గేను కేవలం ప్రత్యేక ఆహ్వానితునిగానే పరిగణిస్తున్నామని ప్రభుత్వ వాదన. దీంతో లోక్‌పాల్ నియామకం మరింత ఆలస్యమవుతూ వస్తోంది.