న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే ఘన విజయాన్ని సాధించారు. ఆయనకు 7,897 ఓట్లు పోలయ్యారు. ఆయన ప్రత్యర్థి శశిథరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. 6,285 వోట్ల ఆధిక్యతతో మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగిపోయారు. మల్లికార్జున్ ఖర్గేకు శశిథరూర్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ”నిజమైన పార్టీ పునరుద్ధరణ ప్రక్రియ ఈరోజుతో మొదలైనట్టు నేను నమ్ముతున్నాను” అని పేర్కొన్నారు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు అభినందనలు తెలిపారు. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కానివారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడుతుండటం 24 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. దక్షిణాది నుంచి ఆ ఉన్నత స్థానానికి ఎదిగిన వారిలో ఖర్గే పదోనేత. గత పాతికేళ్లుగా ఆ పదవిలో దక్షిణ దేశీయులు లేదు. ఇరవయ్యేళ్ల తర్వాత తొలి సారిగా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.