కోల్‌కతా: 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ దేశంలో ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. ఆ ఉద్యోగాలు ఎక్కడ అని లోక్‌సభలో కాంగ్రెస్‌సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. శనివారం ఆయన పశ్చిమ్‌బంగలోని కోల్‌కతాలో బ్రిగేడ్ మైదానంలో జరిగిన విపక్షాల ఐక్య ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ సందేశాన్ని చదివి విన్పించారు. దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతోందని, యువత, నిరుద్యోగుల్లో నిస్పృహ నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్థికంగా దేశ ప్రజలు చితికిపోయారన్నారు. సమాజంలో విద్వేషపూరిత భయానక వాతావరణం పెరుగుతోందని, లౌకిక స్ఫూర్తిని కాపాడుకుంటూ మతతత్వ శక్తులను తరిమికొట్టాల్సిన సమయమిది అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తరఫున దేశ ప్రజలందరికీ ఇదే తన సందేశమని సోనియా చెప్పారని తెలిపారు. విపక్షాలుగా అంతా ఏకమవ్వాల్సిన సమయమిదేనన్నారు. విపక్షాలు ఏకం కానంతవరకు మోదీ, అమిత్‌షా ఇదే నిరంకుశ ధోరణితో కొనసాగుతారన్నారు. దేశంలో వర్గాలవారీగా వైషమ్యాలను పెంచుతున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఒక్క రఫేల్ కుంభకోణంలోనే అనిల్ అంబానీకి రూ.30వేల కోట్లు దోచిపెట్టారని దుయ్యబట్టారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయన్నారు. అవేవీ పట్టని మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ఎలా ఆలోచిస్తోందని ప్రశ్నించారు.