న్యూ ఢిల్లీ:యమునా నది కాలుష్యంపై చేసిన వ్యాఖ్యలపై తనకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు పంపి రాజకీయం చేస్తోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈసీ పంపిన నోటీసుల్లో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని అభ్యంతరం తెలిపారు. తాను జీవించి ఉన్నంతకాలం దిల్లీ ప్రజలను కలుషితమైన నీళ్లను తాగనివ్వను అని అన్నారు. ‘యమునా నది కాలుష్యంపై ఈసీ నాకు నోటీసులు పంపింది. నోటీసుల్లో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదు. ఇలా నోటీసులు పంపి ఈసీ రాజకీయం చేస్తోంది. కమిషనర్ ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీశారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగం చేయాలనే దానిపై దృష్టి పెడుతున్నారు. భారతదేశ చరిత్రలో ఆయనలాగా ఎన్నికల కమిషన్ను ఎవరూ పాడుచేయలేదు. కావాలంటే దిల్లీలో ఏదైనా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. నేను మూడు బాటిళ్ల కలుషితమైన నీటిని ఎన్నికల కమిషన్కు పంపిస్తా. వాటిని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు విలేకర్లు సమావేశంలో తాగండి. అప్పుడు నేను తప్పును ఒప్పుకుంటా’ అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు.