ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 5వసారి సమన్లను దాటవేశారు. గతంలో ఇచ్చిన సమన్ల మేరకు కేజ్రీ శుక్రవారం ఈడీ ముందు హాజరుకావాల్సి ఉండగా తాను రావట్లేదని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి పదే పదే సమన్లు పంపి తనను అరెస్టు చేసి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గడిచిన 5 నెలల్లో ఐదుసార్లు ఈడీ ఆయనకు సమన్లు పంపింది. అయితే విచారణను కేజ్రీ ప్రతీసారి దాటవేస్తూ వస్తున్నారు.
కేసు ఇదే
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2021 నవంబర్‌లో న్యూ ఎక్సైజ్ పాలసీ ప్రవేశ పెట్టింది. దీంతో మద్యం రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం వైదొలిగి లైసెన్స్ ఉన్న ప్రైవేట్ వ్యక్తులు లిక్కర్ స్టోర్లు నడిపే అవకాశం కలిగింది. బ్లాక్ మార్కెట్ నియంత్రించడం, ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకొచ్చామని ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
న్యూ ఎక్సైజ్ పాలసీ ప్రకారం అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరచి ఉంచే అవకాశం ఉంది. లిక్కర్ స్టోర్లు డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ ఆదాయం 27 శాతం పెరిగింది. లిక్కర్ పాలసీలో నిబంధనలను తుంగలో తొక్కారని 2022 జూలైలో అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ బహిర్గతం చేశారు. లైసెన్స్ పొందిన కొందరికి లైసెన్స్ ఫీజుపై రూ.144 కోట్ల రాయితీ ఇచ్చారని వివరించారు. దాంతో అప్పటి లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. విపక్షాలు విమర్శించడంతో న్యూ ఎక్సైజ్ పాలసీని కేజ్రీవాల్ సర్కార్ వెనక్కి తీసుకుంది. గవర్నర్ సిఫారసు చేయడంతో 2022 ఆగస్టులో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తర్వాత ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సిసోడియా సహా 14 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా తదితరులు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ని కూడా విచారణకు రావాల్సిందిగా కోరుతూ 2023నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3,18 తేదీల్లో ఈడీ సమన్లు పంపింది. వాటన్నింటినీ ఆయన దాటవేసి విచారణకు హాజరుకాబోనని తేల్చి చెప్పారు.