హైదరాబాదు:బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కేసీఆర్ తనయ కవిత సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ మేరకు తన నిర్ణయాన్ని వెలువరించారు. తన రాజీనామా లేఖలను మీడియా ముఖంగా చూపించారు.ఇదే సమయంలో మాజీ మంత్రి హరీశ్ రావుపై ఆమె నిప్పులు చెరిగారు. హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లొంగిపోయారని ఆరోపించారు. రేవంత్, హరీశ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లారని… ఆ ప్రయాణంలో రేవంత్ కాళ్లను హరీశ్ పట్టుకున్నారని చెప్పారు. ఆ ప్రయాణం తర్వాత హరీశ్ పూర్తిగా మారిపోయారని… రేవంత్ కు లొంగిపోయారని, ఆ తర్వాతే కుట్రలకు తెరలేచిందని తెలిపారు. నాశనం చేయడమే హరీశ్ రావు పని అని మండిపడ్డారు. సంతోష్ రావు చేసిన పనుల వల్ల బీఆర్ఎస్ కు చెడ్డ పేరు వచ్చిందని కవిత అన్నారు. కూరలో ఉప్పు, చెప్పులో రాయి వంటి వాడు సంతోష్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదని… బబుల్ షూటర్ అని విమర్శించారు. ఆయనే సమస్యను సృష్టించి, ఆ సమస్యను ఆయనే పరిష్కరించినట్టు బిల్డప్ ఇస్తారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడూ కేసీఆర్, కేటీఆర్ లనే టార్గెట్ చేస్తారని… హరీశ్ రావును ఒక్క మాట కూడా అనరని అన్నారు.