హైదరాబాద్: భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయటంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. బుధవారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉంచారు. బయటకు రాగానే.. 2024, నవంబర్ 23వ తారీఖు నుంచి ప్రజా క్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. నేను చేసిన పనుల్లో మొట్ట మొదటిది.. ఓ బిడ్డ హాస్టల్లో చనిపోతే అక్కడి వెళ్లాను. గురు కులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం పెద్ద ఎత్తున పని చేశా. మహిళలకు 2500 ఇవ్వాలని పోస్టుకార్డు ఉద్యమం చేశాను’ అని అన్నారు. 10 నెలల వ్యవధిలో 42 నియోజకవర్గాల్లో పర్యటించా. రాష్ట్రంలో ఏ మూల సమస్య ఉన్నా స్పందించా. పార్టీ కోసం నేను చేసిన సేవలను నాయకత్వం పునరాలోచన చేయాలి. నేను మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకంగా కాదు. పార్టీలో ఉన్న కొందరు నాపై కక్షగట్టారు. సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నా.. అది తప్పా?. నేను ఏం తప్పుగా మాట్లాడాను.. సామాజిక తెలంగాణ అంటే బీఆర్ఎస్ వ్యతిరేకం ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు. కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా. నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏం చేశారు?. నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కేటీఆర్ నుంచి ఫోన్ కూడా రాలేదు. మహిళా నేతలు నా పై ప్రెస్ మీట్ పెట్టారు. అది మంచిదే.. అదే నేను కోరుకున్నది. కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలను కుంటున్నారు. అందుకే నన్ను పార్టీ నుంచి బయట పడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారు. రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.