బిగ్‌బాస్ రెండవ సీజన్ ప్రారంభమయ్యే వరకు కౌశల్ అంటే తెలుగు జనాలకు ఎవరో కూడా తెలియదు.కొన్ని ధారావాహికల్లో,అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ ఉన్న కౌశల్ బిగ్‌బాస్ అనంతరం పెద్ద హీరోల స్థాయిలో అభిమానులు,క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు.బిగ్‌బాస్ జరుగుతుండగానే కౌశల్‌కు మద్దతుగా బయట అభిమానులు కౌశల్ ఆర్మీని ఏర్పాటు చేసి బిగ్‌బాస్ రెండవ సీజన్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకొని బిగ్‌బాస్‌ను శాసించారు.చివరకు కౌశల్‌ను విజేతగా కూడా నిలిపారు.అనంతరం కౌశల్ ఆర్మీని కౌశల్ ఫౌండేషన్‌గా మార్చి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు కౌశల్ కూడా స్వయంగా తెలిపాడు.బిగ్‌బాస్ అనంతరం కొద్ది రోజులు హడావిడి చేసిన కౌశల్ ఆర్మీ కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉండిపోయింది.అయితే కౌశల్ తాము అనుకున్నంత మంచివ్యక్తి కాదంటూ కౌశల్ ఆర్మీ సభ్యులు ఆరోపణలు చేయడం అందుకు కౌశల్ స్పందించి వాటిని ఖండించడం ఇలా కొద్ది రోజులుగా కౌశల్ ఆర్మీ మరోసారి హంగామ చేస్తోంది.అందుకు ఓ తెలుగు వార్త ఛానెల్,ఓ సీనియర్ జర్నలిస్ట్ అదేపనిగా ప్రసారం చేస్తూ గొడవకు మరింత ఆజ్యం పోశారు.ఇలా తనపై ఆరోపణలు వస్తుండడం వాటికి ఆధారాలు అడుగుతుండడం రోజురోజుకు తీవ్రమవుతుండడంతో చేసేది లేక కౌశల్ ఆర్మీ ఫౌండేషన్‌ను రద్దు చేస్తున్నట్లు కౌశల్ స్వయంగా ప్రకటించాడు.ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు,తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఫౌండేషన్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నానని త్వరలో ఫౌండేషన్ సభ్యులను కలుసుకొని తదుపరి కార్యాచరణ వివరిస్తానన్నారు.ఫౌండేషన్‌లోని రాష్ట్రస్థాయి,జాతీయస్థాయి కమిటీలు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.కౌశల్ తీసుకున్న నిర్ణయంతో కౌశల్ అభిమానులు షాక్ గురయ్యారు..