బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలను యధావిధిగా కొనసాగించాలని ఆ రాష్ర్ష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి ఎస్. సురేశ్ కుమార్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చివేయడంతో పాటు విద్యార్థులకు తెలుగు లేదా ఉర్దూను నిర్బంధ బోధనా విద్యగా ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల సరిహద్దు ప్రాంతాల్లోని కన్నడ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కర్ణాటకలో తెలుగు మాధ్యమ పాఠశాలలను ప్రభుత్వం కొనసాగిస్తుండడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీకృష్ణ దేవరాయల కాలానికి ముందు నుంచే తెలుగు, కన్నడిగుల మధ్య సోదర భావం నెలకొని ఉందని గుర్తు చేస్తూ, భాష, సంస్కృతి విషయంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య సామీప్యత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానం వల్ల కన్నడిగులు మాతృ భాషలో విద్యా బోధనను కోల్పోతారని, కన్నడ ఉపాధ్యాయుల మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక కన్నడ విద్యా బోధనను కొనసాగించాలన్నారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.