ముంబై : టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ భారత జట్టు క్రికెటర్లకు చురకలు అంటించారు. జాతీయ జట్టు తరఫున నిరంతరం ఆడుతున్న క్రికెటర్లు అలసిపోయామని భావిస్తే, ఐపీఎల్ ఆడొద్దని సూచించారు. మ్యాచులు, సిరీసులకు మధ్య కనీస విరామం ఉండటం లేదని క్రికెటర్లు వాపోతున్న నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. సాధన చేసేందుకు తమకు సరైన సమయం దొరకలేదని సారథి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘ఒత్తిడి, అలసట, శారీరక బడలిక ఉన్నట్టు అనిపిస్తే ఐపీఎల్ ఆడకండి. ఇక్కడ మీరు దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదు. నిజంగానే మీరు అలసిపోయారని భావిస్తే ఐపీఎల్ సమయంలో విశ్రాంతి తీసుకోండి. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనుభూతే మరోలా ఉంటుంది’ అని కపిల్ అన్నారు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు అత్యుత్తమంగా శ్రమించాలని సూచించారు. ఫ్రాంచైజీ క్రికెట్ కోసం అంత కష్టపడుతున్నప్పుడు, దేశం కోసం ఎందుకు రాజీపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వన్డే సిరీసులో 0-3తో ఓటమి, అలసట, ఒత్తిడి వల్లే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీసులో టీమ్‌ఇండియా ఓడిపోయిందా? అని అడగ్గా ‘నాకు తెలియదు. టీవీల్లో చూసి మాట్లాడటం సబబు కాదు అని ఆయన చెప్పారు.