ఖన్ద్వా: పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు వేగం ధాటికి మధ్యప్రదేశ్, బుర్హాన్పూర్ జిల్లా, చాందినీ రైల్వే స్టేషన్ భవనం కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదు. ఆ రైలు వేగం గంటకు 110 కి.మీలు. రైలు వేగం కారణంగా రైల్వే కార్యాలయం కూలిపోవడం దేశంలో తొలిసారి. ఈ భవనాన్ని 14 ఏళ్ల కిందట కట్టారు. రైలు వెళుతున్న ప్పుడు వచ్చిన ప్రకంపనలకు స్టేషన్ సూపరింటెండెంట్ కార్యాలయం కిటికీలు పగిలిపోయాయి. బోర్డులు కింద పడిపోయాయి. ప్లాట్ఫారంపై భవన శిధిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఎడిఆర్ ఎం మనోజ్ సిన్హా, ఖండ్వా ఎడిఎన్ అజయ్ సింగ్, సీనియర్ డిఎన్ రాజేష్ చిక్లే తదితరులు చాందినీ స్టేషన్ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే రైళ్ల వేగాన్ని తగ్గించారు. చాందినీ రైల్వే స్టేషన్ దేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై-ఢిల్లీ రైల్వే మార్గంలో ఉంది. ‘చాందినీ స్టేషన్ భవనంలోని కొంత భాగం కూలిపోయింది. దీనికి త్వరలోనే మరమ్మతులు చేయనున్నారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నార’ని భుసావల్ డిఆర్ ఎం వివేక్ కుమార్ గుప్తా తెలిపారు.