చెన్నై: దేశ సంక్షేమం కోసమే డీఎంకే కూటమిలో చేరామని మక్కల్ నీదిమయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌పేర్కొన్నారు. డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జూన్ 19న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి ఓ సీటిచ్చినందుకుగాను ఆయన స్టాలిన్, డీఎంకే నేతలకు ధన్యవాదాలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కుదిరిన పొత్తుల ప్రకారం లభించిన రాజ్యసభ స్థానానికి కమల్ పోటీ చేయనున్న విషయం విధితమే. ఈ భేటీ అనంతరం కమల్‌హాసన్ అన్నా అరివాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మక్కల్ నీది మయ్యంకు రాజ్యసభ స్థానం కేటాయించినందుకుగాను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు.