బెంగళూరు:నటుడు కమల్ హాసన్ “తమిళం నుంచే కన్నడ పుట్టింది” అంటూ చేసిన వ్యాఖ్యలు సృష్టించిన వివాదం చల్లారే సూచనలు కనిపించడం లేదు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే, ఆయన నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కానివ్వబోమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించడంతో కమల్ హాసన్ నేడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.ఈ వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం. నరసింహులు మాట్లాడుతూ “ఆయన క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదల కాదు. ఇది ఖాయం. ఇది పరిశ్రమకు సంబంధించిన విషయం కాదు. రాష్ట్రానికి సంబంధించింది. రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కన్నడ అనుకూల సంస్థలు ఆయన స్పందించాలని కోరాయి. ఆయన క్షమాపణ చెప్పకుండా సినిమా విడుదల కావడం కష్టం. మా ఎగ్జిబిటర్లు గానీ, డిస్ట్రిబ్యూటర్లు గానీ సినిమాను ప్రదర్శించడానికి సిద్ధంగా లేరు. అలాంటప్పుడు సినిమా ఇక్కడ ఎలా విడుదలవుతుంది?” అని ప్రశ్నించారు.