రాయ్పూర్ : మహాత్మా గాంధీపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతోపాటు ఆయనను హత్య చేసిన నాథూరాం గాడ్సేను ప్రశంసించినందుకు కాళీచరణ్ మహరాజ్పై ఇక్కడి ఠాణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. రాయ్పూర్ మాజీ మేయర్ ప్రమోద్ దుబే ఫిర్యాదు చేసారు. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 505(2) (వివిధ వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషం లేదా దురభిప్రాయాలను సృష్టించడం లేదా ప్రోత్సహించడం), సెక్షన్ 294 (బహిరంగ ప్రదేశంలో అశ్లీలంగా ప్రవర్తించడం) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. రాయ్పూర్లోని రావణ్ భాటా మైదానంలో ఆదివారం జరిగిన ధర్మ సంసద్ సభలో కాళీచరణ్ మాట్లాడారు. రాజకీయాల ద్వారా దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనేదే ఇస్లాం లక్ష్యమని ఆరోపించారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు గౌరవ వందనం చేస్తున్నానని తెలిపారు. దీంతో ఈ సభ నిర్వా హకు ల్లో ఒకరైన రామ్ సుందర్ మహరాజ్ (కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే) సభ నుంచి వెళ్లిపోవడంతో, రెండు రోజులపాటు జరగవలసిన ఈ సభ అర్థాంతరంగా నిలిచిపోయింది. కాళీ చరణ్ వ్యాఖ్యలను పలువురు రాజకీయ నేతలు ఖండించారు.