జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారమైంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శుక్రవారం ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మేడిగట్ట ఆనకట్టను ప్రారంభించాక గోదావరి మాతకు పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఫడణవీస్‌లు వరుసగా విశిష్ట, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తదుపరి మేడిగడ్డ నుంచి ప్రత్యేక వాహనాల్లో కన్నేపల్లి వద్దకు వెళ్లి పూజలు నిర్వహించారు. పంప్ హౌస్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించగా, కేసీఆర్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సంబురాలు చేసుకున్నారు. పట్టణాలు, గ్రామాల్లో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు.