నెల్లూరు :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 86 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం విడుదలయ్యారు. అయితే, హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు ఆయన నెల్లూరు జిల్లాలో ప్రవేశించరాదని కఠిన నిబంధన విధించింది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన ఆరోపించారు.తనపై ప్రభుత్వం చిత్రవిచిత్రమైన, హాస్యాస్పదమైన కేసులు బనాయించిందని కాకాణి అన్నారు. “సర్వేపల్లి రిజర్వాయర్‌లో బాంబులు పెట్టి మట్టిని తవ్వానని నాపై కేసు పెట్టారు. ఇది విని నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కాలేదు. ఎన్నికల సమయంలో మద్యం పంచుతానని చెప్పానంటూ, ప్రశ్నించిన వారిపై దాడి చేశానంటూ అక్రమ కేసులు నమోదు చేశారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టలేదని, కానీ తనపై ఏకంగా ఆరు సోషల్ మీడియా కేసులు పెట్టారని తెలిపారు.ఈ జైళ్లు, కేసులకు తాను భయపడేది లేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తన పోరాటం ఆగదని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కుమారుడి దోపిడీని అడ్డుకుని తీరుతానని శపథం చేశారు. తాను నెల్లూరు జిల్లా బయట ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా, ఇతర మార్గాల ద్వారా తన పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు.కష్టకాలంలో తనను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన విడుదల ఆలస్యం కావడంతో, మరో కొత్త కేసు ఏమైనా సృష్టిస్తున్నారేమోనని అనుమానం కలిగిందని, అధికారులు వచ్చి చెప్పేంత వరకు తాను విడుదలవుతానని నమ్మలేదని కాకాణి వివరించారు. తాను మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉన్నానని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.