హైదరాబాదు:పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునివ్వడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలను నిర్ణయించేది కేటీఆర్ కాదని, ఎన్నికల సంఘమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్ కు గానీ, కేటీఆర్‌కు గానీ లేదని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పార్టీలను విలీనం చేసుకున్నారని, ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని విమర్శించారు. ఉప ఎన్నికలు వస్తే తాను తిరిగి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయం కోసం తాము వేచి చూస్తున్నామని ఆయన తెలిపారు.