ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ తీరు చూస్తుంటే ఈసారి
శాసనసభ ఎన్నికల్లో గట్టిగానే పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.శనివారం
మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల్లో తెదేపా,వైసీపీ,జనసేనకు ఘోర పరాభవం తప్పదంటూ జోస్యం
చెప్పారు.ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రజాశాంతి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
చేయనున్నామన్నారు.ఈ సందర్భంగా మాది పగిలిపోయే గ్లాస్ కాదు,తొక్కితే ఊడిపోయే సైకిల్
కాదు,తుప్పు పట్టిన ఫ్యాన్ కాదు మాది హెలికాప్టర్ అంటూ వ్యాఖ్యానించారు.ఎన్నికల్లో
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు – వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం వృథా అని పాల్ వివరించారు.ఇప్పటికైనా తెదేపా-వైసీపీలో వలసలు ప్రోత్సహించడం మానుకోవాలని
ఎన్నికల్లో ఓడిపోయే పార్టీలకు వలసలు ప్రోత్సహించాల్సిన అవసరం లేదన్నారు. ఇక టీడీపీ – వైసీపీలకు
చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఐతే.. వారిని ఆ పార్టీ అధినేతలు భయపెడుతున్నారని పాల్ ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? అనే విషయం మాత్రం చెప్పకపోవడం గమనార్హం.ఇదిలాఉండగా – జనసేనతో పొత్తు గురించి మరోమారు పాల్ ప్రకటించారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో చర్చిస్తామని ఒంటరిగా జనసేన పోటీ చేస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. అందుకే.. ప్రజాశాంతితో పొత్తు పెట్టుకోమని పవన్ను అడుగుతున్నామన్నారు..