వాషింగ్టన్ : అమెరికా సైనిక బలగాల చివరి విమానం సోమవారం అర్థరాత్రి ఆఫ్ఘన్ను వీడింది. దీంతో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ విధించిన ఆగష్టు 31 గడువు తేదీలోపే అమెరికా దళాలు ఆఫ్ఘన్ను ఖాళీ చేశాయి. వారం రోజుల నుంచి కాబుల్ బాంబు దాడుల నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఈ విమానం బయలుదేరింది. ‘సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్ సీ-17 కాబుల్లోని హమీద్ కార్జారు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరింది. దీంతో ఆఫ్ఘన్లో సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయింది” అని అమెరికా సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ మెకంజీ పెంటగాన్లో ప్రకటించారు. తొలి నుంచి రెండు పక్షాల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని, ఉపయుక్తంగా ఉన్నారని తెలిపారు. ‘చరిత్రా త్మక క్షణాలు. ఎంతో గర్వంగా ఉంది” అని తాలిబన్ నేత జుబీహుల్లా ముజాహిద్ హర్షం వ్యక్తం చేశారు.