కర్నూలు: తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ బుధవారం ఇక్కడ ప్రకటించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్నూలులో పర్యటిస్తున్న ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చాం. వాటిలో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలి. మూడు రాజధానుల ఆలోచన సరికాదు. మేము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం. పోలవరం పూర్తి చేస్తామ’ని హామీ ఇచ్చారు. అమరా వతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. దేశంలో కొన్ని శక్తులు ద్వేషం, హింసను పెంచుతున్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయన్నారు. ఎన్నికల్లో పొత్తులపై పార్టీ అధ్యక్షుడిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు.