
ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షలా ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం తీసుకు వస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టులను నిరుద్యోగులకే ఇస్తామని వెల్లడించారు. ఆ కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే దక్కేలా చూస్తామని తెలిపారు. చంద్రబాబు 2014లో సీఎం అయ్యేనాటికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం అది రెండు లక్షలకు దాటిందని వెల్లడించారు. ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఆశతో యువత కోచింగ్‌ల కోసం డబ్బులు ఖర్చు పెడుతోందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏటా పదో తరగతి పాసయ్యే వారు అయిదు లక్షల మంది, ఇంటర్ పాసయ్యే వారు నాలుగు లక్షల మంది, డిగ్రీ పాసయ్యే వారు లక్షా ఎనభై వేల మంది, పీజీ పూర్తి చేసిన వారు లక్షా పది వేల మంది ఉన్నారని చెబుతూ, వీరందరికీ ఉద్యోగాలు లభించేలా కార్యాచరణను రూపొందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.