విజయనగరం : 2006లో జిందాల్ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులను బెదిరిస్తూ చట్టం ప్రకారం పరిశ్రమ పెట్టకపోవడం వలన రైతులకు తిరిగి భూములు ఇవ్వాల్సింది పోయి, జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చేసిన బెదిరింపు ప్రకటనకు సమంజసం కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. శనివారం ఎల్బీజీ భవనంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద నుండి భూములు తీసుకుని 17 సంవత్సరాలైనా నేటి వరకు ఎటువంటి పరిశ్రమ కట్టలేదని, స్థానిక ప్రజలకు ఉపాధి చూపలేదన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల వద్ద నుండి తీసుకున్న భూములను ఐదేళ్లలో పరిశ్రమ కట్టకపోతే తిరిగి రైతులకు అప్పజెప్పాలని చట్టంలో ఉన్న విషయం కలెక్టర్ కి తెలియదు అని మేము అనుకోవడంలేదన్నారు. 2006 భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఎందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ నిర్వహించారని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు పరిశ్రమను వ్యతిరేకించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. 17 ఏళ్లు అవుతున్న పరిశ్రమ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. 17 ఏళ్లుగా పరిశ్రమ పెట్టకపోతే భూములు వెనక్కి ఇవ్వకుండా ఇప్పుడు ఏం ఎస్ పి పార్కు పెడతామని చెప్పి అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బెదిరించడం సరికాదని దీనిని సిపిఎం గా ఖండిస్తున్నామన్నారు. చట్టాలను ఉల్లంఘించే వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నేటికి పూర్తి స్థాయిలో రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. చట్ట ప్రకారం పరిశ్రమ పెట్టలేదు కాబట్టి తీసుకున్న భూములు రైతులకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.అవి ప్రభుత్వ భూములు అని అనడం సరికాదన్నారు. మూడేళ్లు సాగులో ఉంటే భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెలించాలన్నది కలెక్టర్ కి తెలియదా అని ప్రశ్నించారు.చట్టాన్ని అమలు చేయాల్సిన జిల్లా మేజిస్ట్రేట్ ఈ విధంగా అనడం సరికాదన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు ఈ భూములు అప్పగించాలని కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. ఒక వేళ కొత్త పరిశ్రమ కోసం భూమి కావాలంటే పబ్లిక్ హియరింగ్ పెట్టీ మరల భూ సేకరణ చేపట్టి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలి తప్ప బెదిరించి తీసుకుంటామని అనడం సరికాదన్నారు.రైతులకు, గిరిజనులకు అన్యాయం చేస్తే సిపిఎం చూస్తూ ఊరుకునేది లేదని వారికి అండగా సిపిఎం పోరాడుతుందన్నారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, టి వి రమణ పాల్గొన్నారు.