జమ్మలమడుగు అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ రెడ్డిని ప్రకటించాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. కొన్నాళ్ల నుంచి సుధీర్ రెడ్డి ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయనకే వైసీపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాడు జగన్. తాజాగా జమ్మలమడుగు పర్యటనలో భాగంగా ప్రజల ముందు జగన్ అభ్యర్థిత్వ ప్రకటన చేశాడు.జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ తనకే అని గట్టిగా చెప్పుకున్న సుధీర్ రెడ్డికి ఆ అవకాశం ఖరారు అయ్యింది. సుధీర్ రెడ్డిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. మాజీ హోంమంత్రి, సీనియర్ పొలిటీషియన్ ఎంవీ మైసూరారెడ్డి తమ్ముడి కొడుకే సుధీర్ రెడ్డి.వృత్తిరీత్యా వైద్యుడితను. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. మూడేళ్ల నుంచి జమ్మలమడుగు రాజకీయంలో యాక్టివ్ గా ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి ఫిరాయింపు నేపథ్యంలో అక్కడ వైసీపీకి ఇన్ చార్జిగా మారాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నాడు.ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి సుధీర్ రెడ్డి బామ్మర్దే అవుతాడు. సుధీర్ రెడ్డి చెల్లెలునే వెంకట్రామిరెడ్డి వివాహం చేసుకున్నాడు. ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తనదే అని మంత్రి ఆదినారాయణ రెడ్డి విశ్వాసంతో ఉన్నాడని సమాచారం.